* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మెగా కన్వెన్షన్ సావనీర్–2022 పుస్తకంలో చోటు దక్కించుకున్న కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Content

పరిచయం



రేమల్లె పరిమళం ‘కృష్ణ’ 

 దొండపాటి కృష్ణ యువ రచయిత. కొత్త రేమల్లె గ్రామం, బాపులపాడు మండలం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీ దొండపాటి గోవర్ధనరావు, శ్రీమతి రంగమ్మ దంపతులకు జన్మించారు. ఈ యువ రచయిత ‘పిట్ట కొంచెం కూత ఘనం’ లాగా చిన్నప్పట్నుంచే పుస్తక పఠనంపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు. తద్వారా మంచికి, చెడుకి భేదం తెలుసుకోగలిగారు. తప్పు, ఒప్పుల జ్ఞానాన్ని సముపార్జించుకోగాలిగారు. సమాజమంతా తన కుటుంబమే అని నమ్మారు. 

పుస్తకాల్లో తాను చదివిన సమాజం, కళ్ళెదుట తనకు కనిపిస్తున్న సమాజం ఒకటి కాదని తెలుసుకున్నాడు. అందుకు తగ్గ కారణాలను అన్వేషించగల కొత్త నేర్పు అలవడిందతనికి. తాను చదివిన గ్రంథాల్లోంచి మంచిని గ్రహించి అటువంటి సమాజాన్ని ఇష్టపడ్డాడు. అలానే ఉండాలని కోరుకున్నాడు. అలాగే ఉంటే బాగుంటుందని అభిలషించాడు.
 
తన వాళ్ళను మార్చుకోవాలనే ఆరాటం, తన వాళ్ళను సమాజాభివృద్ధివైపు నడిపించాలనే తలంపు పుట్టింది. అది అక్షరాల రూపంలోకి మారి కథలుగా రూపుదిద్దుకుంది. దాన్నే సాహిత్యమంటారని అప్పుడతనికి తెలియదు. తాను చెప్పాలనుకున్నది రాసుకుంటూ పోయాడు. తాను కోరుకునే సమాజం, అందులోని వ్యక్తులు ఎలా ఉండాలో చెప్పుకున్నాడు. 

 పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MCA) కోసం కాకినాడ JNTUKకి వెళ్ళినప్పుడు అతని సాహిత్య జీవితానికి స్పష్టమైన అడుగులు పడ్డాయి. శ్రీ చెరుకువాడ సత్యనారాయణ (సి.యస్.) గారిని గురువుగా ఎంచుకుని ఆయన శిష్యరికంలో సాహిత్యపు ఓనమాలు దిద్దారు. 05 మార్చ్, 2018న జాగృతి వారపత్రికలో మొదటి కథ ‘స్పందించిన మనస్సు’ ప్రచురితమైంది. ఆరోజు నుంచి నేటిదాకా ప్రముఖ దిన, వార, మాసపత్రికల్లో 60కి పైగా సామాజిక కథలు, 10కి పైగా చిన్న కథలు, 5 బాలల కథలు, 14 ఇతర రచయితల పుస్తకాలపై సమీక్షలు, 2 వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 9 కథలకు వివిధ సంస్థలు నిర్వహించిన పోటీలలో బహుమతులను అందుకున్నారు. 

 కథ సామాజిక ప్రయోజనం కలిగించేదిగా ఉండాలని బలంగా నమ్ముతాడు ఈ కథకుడు. కథ వలన మంచి జరగకపోయినా ఫర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదంటాడు. అందుకే అతని కథల్లో అసభ్య పదజాలం గానీ, రెచ్చగొట్టే సంఘటనలు గానీ, తప్పుదోవ పట్టించే సందేశాలు గానీ మచ్చుకైనా కనిపించవు. 

 ‘రాతిగుండెలో నీళ్ళు’ అనే కథ రచయితగా గుర్తింపునిస్తే ‘రాముడు-భీముడు’ అనే కథ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మెగా కన్వెన్షన్ సావనీర్ – 2022 పుస్తకంలో చోటు దక్కించుకుని విశ్వమంతా సత్తా చాటింది. ఈ కథలో చెట్టుతో మనిషి పెంచుకున్న మమతానుబంధాల చిత్రణ కళాత్మకంగా ఆవిష్కరించబడింది. తన 33వ యేట వెలువరించిన తొలి కథాసంపుటి “రాతి గుండెలో నీళ్ళు”. ఈ సంపుటికి ప్రతిష్టాత్మక డా.వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం-2023 లభించింది. అంతేకాకుండా కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం – 2023 ఫైనల్ లిస్టులో స్థానం సంపాదించి తెలుగు సాహితీ చరిత్రలో తనకొక స్థానం సంపాదించుకుంది. 

 భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కథకుడంటాడు. నిశ్శబ్దంల్లోంచి పుట్టిన అక్షరం అతని కథగా మలుపు తిప్పుకుంది. యాంత్రిక జీవనంలో మనిషిలో మరుగైపోతున్న భావోద్వేగాలను తట్టి లేపడానికి తన కలం ద్వారా తీవ్రమైన కృషి చేస్తున్నాడు. మనిషిలో దాగున్న భావోద్వేగాలకు కదలికలొస్తే మానవత్వం అనేది మరుగున పడిపోకుండా ఉంటుందంటాడు. 

 ఈ రచయిత నుంచి వచ్చిన రెండో కథాసంపుటి “శ్రీమతి”. ఈ సంపుటిలో మొత్తం 16 కథలున్నాయి. దాదాపు అన్ని కథలూ స్త్రీ నేపథ్యంతో నడవడం విశేషం. 

 భార్య స్వప్న MA Telugu (ఎం.ఏ – తెలుగు) చదివి సాహిత్యంవైపు ప్రయాణం ప్రారంభించారు. కృష్ణకు తగు సలహాలు సూచనలు అందిస్తున్నారు. కుమారులు విశ్వజిత్, రితిన్.

కృష్ణకు అత్యంత ఆప్తులు, అతన్ని నిత్యం తరుముతూ ఉండే పూజ్యులు, అతని మొదటి పుస్తకాన్ని అంకితం తీసుకున్న మహనీయులు శ్రీ. మంత్రిప్రగడ సుబ్బరాయ బోస్, లక్ష్మి గార్ల దంపతులు. వాళ్ళ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. వాళ్ళకెప్పుడూ రుణపడి ఉంటానంటారు.

 
శ్రీ. చెరుకువాడ సత్యనారాయణ (C.S)

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనల కోసం...