"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

దొండపాటి వంశ చరిత్ర


కొత్త రేమల్లె గ్రామంలో దొండపాటి  వంశ చరిత్ర

          గ్రామాల, పట్టణాల ఏర్పాట్లు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కృష్ణా జిల్లాలో, బాపులపాడు మండలమందు రేమల్లె అనే గ్రామముంది. కొత్త రేమల్లె గ్రామం ఏర్పడి శతాబ్దం దాటిపోయిందేప్పుడో.! ఒకప్పుడు గ్రామం నిండా పండితులు (బ్రాహ్మణలు) తిరుగాడారు. రాజుల సంరక్షణలో వారి జీవితాలు సుభిక్షంగా గడిచాయి. రాజులు సాహిత్యాన్ని ఎక్కువుగా ఆస్వాదించేవారు. వారు మెచ్చితే ఆ పండితునికి రాజ్యంలో పండే భూముల్ని బహుమానాలుగా ఇచ్చేవారు. అందువల్ల బ్రాహ్మణులకు పాడి పంటలు ఎక్కువుగా ఉండేవి. వాటిని చూసుకోవడానికి “కమ్మ” కులస్తులను పాలేర్లుగా పెట్టుకున్నారు.

          ఎప్పుడైతే రాజ్యాల పరిపాలన అంతమై, బ్రిటీష్ వాళ్ళు దేశాన్ని పరిపాలించడం ఆరంభమయ్యిందో పాండిత్యం మరుగున పడిపోయింది. క్రైస్తవ మతం జనాల్లోకి ఎక్కించాలని బ్రిటీష్ వాళ్లు చేయని ప్రయత్నం లేదు. కాస్తంత చరిత్ర తెలిసిన వాళ్లకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అంతలా వారి క్రూరత్వాలుండేవి. వారినుంచి పామరులను రక్షించడానికి, రాజుల నుండి బహుమానాలుగా పొందిన స్థలాల్ని పంచిపెట్టారు. పరమతం వైపు వెళ్లోద్దని మొత్తుకున్నారు. సనాతన హైందవ మతాన్నే ఆచరించమని ప్రభోదించారు.

          బ్రిటీష్ వాళ్ళ అకృత్యాలకు బ్రాహ్మణులు భూముల్ని వదులుకోవడంతో, వారినే అంటిపెట్టుకున్న “కమ్మ” కులస్తులు వాటిని పొందారు. బ్రాహ్మణులకు పాండిత్యం తప్పితే మరో పని చేత కాదు. “కమ్మ” కులస్తులు భూములకు యజమానులై పాడి పంటలను అభివృద్ధి చేసుకుంటూ బ్రాహ్మణులకు కావాల్సిన పాలు, పెరుగు, వెన్నెలను సరఫరా చేసేవారు. కాలక్రమేణ పాలు అమ్మడమే వారి కులవృత్తిగా మారిపోయింది. అలా రేమల్లె గ్రామంలో కూడా కొన్ని వందల ఎకరాల్ని “కమ్మ” కులస్తులు ఆస్తులుగా పొందారు. రానూ పోనూ భూముల బాగోగుల్ని చూసుకోవడం వారికీ ఇబ్బందైపోయింది. రేమల్లె, శింగన్నగూడెం గ్రామాల మధ్య దూరాన్ని చెరిపేస్తూ మధ్యలో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

          రోజులు గడుస్తున్న కొద్దీ వారికి పనిభారం పెరిగిపోయింది. పాలేరు పనికి పక్కనున్న శింగన్నగూడెం గ్రామం నుండి పాదరక్షలు బాగుచేసే కులవృత్తి కల్గిన, ‘తొమ్మండ్రు’ ఇంటిపేరుగా కల్గిన “మాదిగ” కులస్తుడి కుటుంబాన్ని తీసుకొచ్చారు. ఆ ఇంట్లో పెళ్లీడుకొచ్చిన ఆడపడుచుకు “బోర్వంచ” గ్రామం (కృష్ణా జిల్లా) నుండి ‘దొండపాటి’ వంశానికి చెందిన “ఇద్దయ్య” నిచ్చి పెళ్లి చేశారు. అతన్ని ఇల్లరికం ఉంచేయ్యడంతో ఆ గ్రామంలో ‘దొండపాటి’ వంశానికి పునాది పడింది. 

          అదే తొమ్మండ్రు కుటుంబంలో వయసొచ్చిన కుర్రాడికి రేమల్లె గ్రామం పక్కనున్న ‘వేలేరు’ గ్రామం మాదిగగూడెం నుండి ‘నిమ్మకూరు’ ఇంటిపేరు కల్గిన అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు.అలా దొండపాటి, తొమ్మండ్రు & నిమ్మకూరు వంశస్థులు అడుగుపెట్టడంతో మాదిగగూడెం పురుడు పోసుకుంది. “కమ్మ” కులస్తుల కన్నా “మాదిగ” కులస్తుల సంఖ్య పెరిగిపోయింది. ఇళ్ళు పెరిగి జీవం తెచ్చుకుంది. ఆ గ్రామానికేం పేరు పెట్టాలో తెలీక మొదటిగా రేమల్లె నుండి రావడంతో ‘రేమల్లె’ గ్రామం ముందు ‘కొత్త’ అనే పదాన్ని చేర్చారు. ఇక్కడ ‘కొత్త’ అనే పదాన్ని చేర్చడం వలన “కొత్త రేమల్లె” అయింది. ఇతరులకు స్పష్టంగా తెలియడానికి ‘కొత్త రేమల్లె’, ‘పాత రేమల్లె’ అని సంబోధించడంతో అవే పేర్లు రికార్డులకేక్కాయి. రేమల్లె గ్రామం తర్వాత పంచాయితీ గ్రామంగా మారింది. కొత్త రేమల్లె గ్రామం, రేమల్లె పంచాయితీ పరిధిలోకొచ్చింది. 

          ఇక దొండపాటి వంశ చరిత్రకోద్దాం. బోర్వంచ గ్రామం నుండి కొత్త రేమల్లె గ్రామానికి వలస వచ్చిన ఆ మొదటి కుర్రాడే “దొండపాటి ఇద్దయ్య”. కొత్త రేమల్లె గ్రామంలో దొండపాటి వంశం పురుడు పోసుకోవడానికి కారణమైన అతనే ఆరాధ్యుడయ్యాడు. ఇద్దయ్యకు నలుగురు కొడుకుల పేర్లు వరుసగా రామయ్య, లక్ష్మయ్య, తిరుపతయ్య & కోటయ్య మరియు కూతుళ్లీను.అప్పట్లో కుటుంబ నియంత్రణ పద్ధతులు లేకపోవడంతో అందరూ మరింత సంతానాన్ని కలిగారు. మొదటివాడు రామయ్యకు ఐదుగురు కొడుకులు వరుసగా ఆంజనేయులు, రాఘవులు, ఇద్దయ్య, వెంకటేశ్వరరావు & కృష్ణ (నేను కాదు, చిన్న తాతయ్య ఇతను). రెండోవాడు లక్ష్మయ్యకు ముగ్గురు కొడుకులు. మూడోవాడు తిరుపతయ్యకు కొడుకుల్లేరు, కూతుళ్లే ఉన్నారు. అలాగే చివరివాడు కోటయ్యకూ అంతే.!వీళ్ళందరిలో అందరి దృష్టి ఆకర్షించేవాడు ఇద్దయ్య. దొండపాటి ఇద్దయ్య గారి పెద్ద కొడుకైన రామయ్య, అతని మూడో కొడుక్కి తండ్రిపేరు ‘ఇద్దయ్య’ అని పెట్టుకున్నాడు. ఇతనే మా తాతయ్య. బ్రిటీష్ వాళ్ళను ఎరిగిన మా ఊరిలో చివరి వ్యక్తి. నానమ్మ “ఈశ్వరమ్మ” కూడా బ్రిటీష్ వాళ్ళను ఎరుగును. 

          ఇక మా కుటుంబ విషయానికొస్తే తాతయ్య ఇద్దయ్యకు నలుగురు కొడుకులు వరుసగా గోవర్ధనరావు, ఏడుకొండలు, అయోధ్యబాబు & కిషోర్ బాబు. వీరి తర్వాత నడుస్తుంది మా తరమే! నాలుగు తరాల తర్వాత కుటుంబ నియంత్రణ అమల్లోకి రావడంతో సంతానం తగ్గింది. నాన్నగారు గోవర్ధనరావు, అమ్మ రంగమ్మ దంపతులకు నేనొక్కడినే కొడుకిని & కోడలు స్వప్న, ఇద్దరు కూతుళ్లు (సాంబశివ, పద్మావతి). ఏడుకొండలు బాబాయ్ కు ఇద్దరూ కూతుళ్లే. అయోధ్య బాబు బాబాయ్ కు ఒక కొడుకు వినయ్ బాబు మరియు కూతురు మాత్రమె! చిన్న బాబాయ్ కిషోర్ బాబాయ్ కు ఇద్దరు కొడుకులు అతులిత్ & వర్షిత్. 

          ఈ ఐదు తరాల్లో మొట్టమొదటిగా చదువులు వైపు మళ్ళింది చిన్న బాబాయ్ కిషోర్ ఒక్కడే.! నాన్నగారు గోవర్ధన రావుకు చదువుమీదున్న మమకారంతో, తాతయ్య ఇద్దయ్యతో గొడవపడి చదివించాడు. తరాలు మారుతున్నాయని, అందరూ పాలేరుతనం చేసుకుంటూ వెళ్తే అజ్ఞానమే మిగులుతుందని నచ్చజెప్పాడు. ఆయన తర్వాత తరం మేం కూడా చదువులు వైపే అడుగులు వేశాం. దొండపాటి వంశాభివృద్ధిని చూసి నిమ్మకూరి, తొమ్మండ్రు వంశస్థులు కూడా అవలంబించారు. మేం అభివృద్ధి చెందాం. వాళ్ళూ అభివృద్ధి చెందారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ళే మాకన్నా పై చేయి సాధించారు. 

          కొత్త రేమల్లె గ్రామానికి క్రీ.శ.1999 సంవత్సరంలో నిర్మించిన ‘శ్రీ అభయాంజనేయ స్వామీ’ ఆలయం తలమానికంగా ఉంది. కానిప్పుడు పట్టించుకునేవాళ్ళు కరువయ్యారు. గ్రామాలు వలసలు పోయినట్లు మతాలు కూడా వలసలు పోతున్నారు. ఎందుకిలా జరుగుతుందంటే కాలమే చెప్పాలి..!!0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!