దహింపబడే ఈ
దేహానికి
విభిన్న లక్షణాలు
ఆపాదించ బడ్డాయి.
కామంతో పుట్టిన ఈ
దేహం
అగ్నితో దగ్ధమయ్యే
లోపల
ఈ లక్షణాలన్నీ తను
నేర్చుకున్న నడకను
పనులకై పరుగులు
పెట్టిస్తాయి.
ప్రేమ బహు రూపిణి
అది దేహం నుండి
భావోద్వేగంలా వ్యక్తపడుతూ
సందర్భాన్ని బట్టి
నడుచుకుంటూనే
ఒక్కో క్షణంలో
ఒక్కో రూపంలో
కాపాడుతుంది -
అవమాన పడినా కూడా !
తారతమ్య భేదాలను
ప్రకటించకుండానే
ఒకటేనంటూ తనలో
కలిపేసుకొని
బంధాలు నిలయమై
ఉండడానికి కారణ మవుతుంది.
మనస్పర్ధలు
విడదీస్తున్న బంధాలను
శాశ్వతంగా
దూరముంచకా ఆకర్షిస్తున్నా
పై చేయి తనదేనని
అనలేము.
శంకింపబడి శోకానికి
కారణమవ్వచ్చు !
అపనిందలను
మోసుకుంటూ తిరగవచ్చు !
ప్రతీకారావేశాలతో
ప్రకోపానికి దారి తీయవచ్చు !
ఎందుకోగాని ఈ ప్రేమ
తీవ్ర ఒత్తిడులకు గురై
యువతీ యువకుల
మనస్పర్ధల చేతుల్లో
లోలకంలా
డోలనావర్తనాలు చేస్తుంది.
ఒకరు తమ అక్కసును
మరొకరిపై కక్కేస్తారు.
ఒకరు తమ బాధను
ప్రేమపై తోసేస్తారు.
ఒకరు వారికిది గుణ
పాటమంటారు.
ఒకరు ముందే
తెలిసిందని సంతసిస్తారు.
ఒకరు నాస్తికుడిలా
మారిపోయి
గీతోపదేశంలా
అనుభవోపదేశాన్ని చేస్తారు.
కుటిల బుద్ధితో ఈ
దుశ్చర్యల కాలంలో
ఘడియ విఘడియల మధ్య
ప్రేమ ఎంత నలిగిపోతుందో ..!
ఇక ప్రేమ డోలనాలను
సెకన్లకొకసారి లెక్కించాలా ?
వారి మధ్య మనస్పర్ధ
లన్నింటిని గుణించాలా ?
వారి మనస్సుల మధ్య
దూరాన్ని తీసివేయాలా ?
వారి తప్పొప్పులను
భాగాహరించాలా ?
ఇన్ని జరిగి శేషం
శూన్యం వచ్చినా
చంచల హృదయులకు
కూడికలు జరుగుతాయా ..?
కలపలేక కలుపు
గోలుపుగా ఉండలేక
ఎంత నిస్సహాయంగా
మారిపోయిందో ఈ ప్రేమ !
ఎప్పటికప్పుడు
మార్పులు చెందుతూ
నిర్వచనాలను
మార్చుకుంటుందే గాని
ఒక్కో విధంగా
పిలిపించుకో బడుతుండే గాని
స్పష్టమైన
నిర్దిష్టమైన నిర్వచనం లేక
అడుగడుగునా
నిరూపణలకు గురౌతుంది.
పడిన అల ఎగసి పడక
మానుతుందా ?
మోడు వారిన చెట్టు
నీరందగానే చిగురించక ఆగుతుందా ?
అగ్ర పీటమైన
సింహాసనంపై ఎక్కి
ప్రేమ నిలయంలో
ఆధిపత్యం చెలాయిస్తూ
ధైర్యాన్ని జేబులో
దాచుకుంటే సొంతమవుతానంటూ
ఎప్పటికి వన్నె
తరగని కాలమౌతుంది ప్రేమ.!
16th July, 2012.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు